సమయస్పూర్తి- 1
సరళ, రాధ ఇద్దరూ బస్సుదిగి మాట్లాడుకుంటూ రంగాపురంలోకి వస్తున్నారు. వారిద్దరి ఒంటి మీద
దాదాపు లక్షరూపాయల విలువగల బంగారముంది. సరిగ్గా అదే సమయంలో రంగన్న వీరిద్దరినీ
చూశాడు.
నల్లటి చారలున్న బనియన్, గళ్ళ లుంగీ, పొడవైన మీసాలు, పెరిగిన జుట్టుతో రంగన్నను చూస్తే
చిన్న పిల్లలు సైతం జడుసుకుంటారు. అతని పేరు వింటే చాలు చుట్టుప్రక్కల గ్రామాల
ప్రజలందరూ హడలిపోతారు. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవటం వాడికలవాటే. రంగన్న వేగంగా
వెళ్ళి వారి ముందు నిలబడి క్రూరంగా నవ్వాడు. ఆడవాళ్ళిద్దరూ గజగజావణికిపోయారు. ;ఎవరు
నువ్వూ? ఏం కావాలి?; భయపడుతూనే అడిగింది సరళ.
;నా పేరు రంగన్న. మీరు ఈ ఊరికి కొత్తగా ఉన్నారు. అయినా మిమ్మల్ని నేనేమీ చెయ్యను.
మర్యాదగా గొడవ చేయకుండా మీ దగ్గరున్న బంగారమంతా ఇచ్చెయ్యండి. నా దారిన నేను
పోతాను; అన్నాడు. రాధకు పై ప్రాణాలు పైనేపోయాయి. ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు. ;ఊ ఆలస్యం
చెయ్యకండి. నేనసలే మంచివాడిని కాదు. నా టైం వేస్ట్ చెయ్యొద్దు. త్వరగా ఇవ్వండి మీరిలా
ఇవ్వరు. ఇంతవరకూ నా పేరు, నేనెలాంటి వాడినో చెప్పాను. నేనెవరి మనిషినో తెలిస్తే హడలి
చస్తారు. నేను ఈ ఊరి ప్రెసిడెంటు గంగరాజు గారి కుడిభుజాన్ని. ఆయన హత్యలు చెయటంలో
సిద్దహస్తుడు. హ్హహ్హహ్హ తియ్యండి నగలు తియ్యండి; వికటాట్టహాసం చేశాడు రంగన్న.
సరళ ధైర్యం తెచ్చుకొని ;ఒరేయ్ రంగన్నా! మేము నగలు ఇవ్వము. ఏం చేస్తావురా నువ్వు
ప్రెసిడెంటు గారి కుడిభుజానివైతే ఆయన చెల్లెల్నిరా; నువ్విలా మమ్మల్ని ఏడిపించావని మా
అన్నయ్యకు చెప్పానంటే మరుక్షణమే శవమైపోతావు జాగ్రత్త; అని హెచ్చరించింది సరళ. రంగన్న
భయపడి వెంటనే సరళ కాళ్ళు పట్టుకొని ;అమ్మగారూ! నన్ను క్షమించండి. మీరెవరో తెలియక
మిమ్మల్ని ఏడిపించాను. నేనిలా మిమ్మల్ని బెదిరించానని మీ అన్నయ్యకు దయచేసి చెప్పకండి.
ఆయన నన్ను చంపేస్తాడు; అన్నాడు ప్రాధేయపడుతూ.
;సరేలే వెళ్ళూ; అంది సరళ. రంగన్న తిరిగి చూడకుండా పరిగెత్తాడు. వాడలా వెళ్ళాక ;ఏమె సరళా!
ఈ ఊర్లో నీకొక అన్నయ్య ఉన్నాడని, అతను ప్రెసిడట్ అని నాకు మాటవరస క్కూడా చెప్పలేదు
కదే; అంది రాధ. సరళ నవ్వుతూ, ;ప్రెసిడెంటా! పాత చింతకాయా! వాడి బారి నుండి
తప్పించుకోవడానికి అలా అబద్దం చెప్పాను. వెధవ నమ్మేసి పరుగుతీశాడు; అంది. రాధ
ఆశ్చర్యపోయి, ;అమ్మో! సమయస్ఫూర్తితో వ్యవహరించి వచ్చిన అపాయం నుండి ఉపాయంతో బలే
రక్షించావే; అంది.