శివదాసు కవిత్వం
గంగవరం గ్రామంలో శివదాసు అనే కవి ఉండేవాడు. ఆయన కవిత్వం విన్నవారెవరూ ఆయన్ను
మెచ్చుకోకుండా ఉండలేరు. సరళమైన భాషలో, అందమైన భావచిత్రాలతో అందరినీ అలరించేది
ఆయన కవిత్వం. ఆయన కవిత్వం విన్న గ్రామస్థులు, ``శివదాసూ, నువు్వ ఒకసారి వెళ్ళి రాజుగారిని
దర్శించి, నీ కవిత్వం వినిపిస్తే నీకు కనకాభిషేకం జరిపిస్తాడు. నీ పేదరికం తీరుతుంది,
అంటూండేవారు.
అందుకు శివదాసు, ``నా కవిత్వం ఆ స్థాయిలో ఉన్నప్పుడు తప్పక వెళ్ళి మహారాజును దర్శిస్తాను,
అని వినయంగా సమాధానం చెప్పేవాడు. శివదాసు కవిత్వం మధురంగా ఉంటుందన్న విషయం
ఆనోటా ఈనోటా పాకి కనకపురం జమీందారు భువనశంకరుడి చెవిన పడింది. భువనశంకరుడికి
కవిత్వంలో మంచి ప్రవేశముంది. ఆయన శివదాసును ప్రత్యేకంగా పిలిపించి కవిత్వం విన్నాడు.
శివదాసు కవిత్వం జమీందారును ఎంతగానో ఆకట్టుకున్నది. ఆయన శివదాసుకు శాలువాకప్పి,
విలువైన కానుకలతో సత్కరించి, ``అప్పుడప్పుడు వచ్చి, మీ కవిత్వం వినిపించండి.
లేకుంటే నేనే మీ గ్రామానికి రావలసి ఉంటుంది, అన్నాడు. ``అయ్యో! ఎంత మాట! నేనే వచ్చి
కలుస్తూంటాను, అని వినమ్రతతో సెలవు తీసుకుని గ్రామం చేరాడు శివదాసు. ఆయన వచ్చాడని
తెలియగానే కొందరు గ్రామపెద్దలు వచ్చి, శివదాసును అభినందించి, ``శివదాసూ, మేము చెబితే
ఇన్నాళు్ళ పట్టించుకోలేదు. నీలోని ప్రతిభకు జమీందారు సత్కారమే తార్కాణం. ఇప్పటికైనా వెళ్ళి
రాజుగారిని దర్శించు, అని ప్రోత్సహించారు.
``అందుకు ఇంకా కొంత సమయం ఉంది, అని దాటవేశాడు శివదాసు. మూడు నెలల తరవాత
మళ్ళీ ఒకనాడు జమీందారు నుంచి శివదాసుకు పిలుపు వచ్చింది. ఆయన కనకపురం వెళితే
జమీందారు అక్కడ లేడు. కనకపురానికి ఉత్తరంగా కొద్దిదూరంలో ప్రవహించే గంగానదీ తీరంలో
జమీందారుకు పెద్ద తోట, భవనం ఉన్నాయి. ఇప్పుడాయన అక్కడ బస చేస్తున్నాడని
తెలియడంతో శివదాసు అక్కడికి వెళ్ళాడు.
శివదాసు వినిపించిన సుమధుర కవిత్వానికి ముగ్థుడైన జమీందారు, ``ఇంత గొప్ప కవిత్వం చెప్పిన
తమకు ఈ భవనంలో కొన్నాళు్ళ ఆతిథ్యమిచ్చి గౌరవించాలనుకుంటున్నాను. నా కోరిక మన్నిస్తారు
కదూ, అన్నాడు. శివదాసు అందుకు సమ్మతించగానే జమీందారు ఆయనకు అక్కడ కావలసిన
ఏర్పాట్లన్నీ సమకూర్చాడు. మరునాడు సూర్యోదయానికి ముందే లేచి శివదాసు నదీ తీరానికి
వెళ్ళాడు.
చల్లని వాతావరణం. గంగానది రెండు తీరాలను ఆనుకుని నిండుగా, గంభీరంగా ప్రవహిస్తున్నది. ఆ
ప్రవాహ వేగం శివదాసు మనసులో ఓంకారనాదంలా తోచింది. అలాగే కూర్చుని కళు్ళ
మూసుకున్నాడు. కొంత సేపయ్యాక కళు్ళ తెరిచి చూస్తే సూర్యోదయ కిరణాలు పడడంతో ఎదుట
స్వర్ణ ప్రవాహం సాగుతున్నట్టనిపించింది శివదాసుకు. ఆయన మనసులో కవితాధార పెల్లుబికింది.
దానిని మననం చేసుకుంటూ భవనానికి వచ్చి తాళపత్రంలో లిఖించాడు.
దానిని చదువుతూంటే ఆయనలో అలౌకికమైన ఆనందం కలిగింది. అప్పటి నుంచి రోజూ
ఉదయం, సాయంకాలం నదీ తీరానికి వెళ్ళి గంగను దర్శిస్తూ, అక్కడి సుందర వాతావరణాన్నీ;
ప్రాణికోటికి ప్రాణంపోసి రక్షించే గంగమ్మ తల్లి కరుణనూ వర్ణిస్తూ చాలా పద్యాలు రచించాడు. వారం
రోజుల తరవాత జమీందారు అనుమతి పొంది కానుకలతో స్వగ్రామం చేరాడు. శివదాసుకు తాను
రాసిన కవిత్వం చదువుతూంటే, అది ఇప్పుడు రాజుగారికి వినిపించ తగ్గ స్థాయిలో ఉందన్న
నమ్మకం కలిగింది. రాజదర్శనం చేసుకోవాలనుకున్నాడు. ఆయన నిర్ణయం విని, గ్రామ పెద్దలు
సంతోషించారు.
రాజధానికి బయలుదేరిన శివదాసును సాగనంపడానికి వచ్చిన గ్రామపెద్దల్లో ఒకా యన,
``ఇన్నాళ్ళకు మా మాట విని నువు్వ రాజ దర్శనానికి వెళుతున్నందుకు చాలా సంతోషం,
అన్నాడు. పక్కనే ఉన్న మరొక పెద్దమనిషి, ``రాజ సన్మానం పొంది, ఆస్థానకవివయ్యాక, పుట్టి
పెరిగిన ఊరిని మరిచి పోవద్దు శివదాసూ, అన్నాడు. ``మన శివదాసుది అలా మరిచి పోయే
స్వభావం కాదులే, అన్నాడు మూడో పెద్దమనిషి.
``అది ఇప్పుడే ఎలా చెప్పగలం? సంపదలు కలిగాక మనిషి ఎలా మారిపోతాడో, ఏమో? అన్నాడు
నాలుగో వ్యక్తి. ``ఒక్క సంపద లేనా? భోగభాగ్యాలతో పాటు గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు,
సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి కదా? అప్పుడు మామూలు మనుషులమైన మనం
గుర్తుండడం గొప్ప విషయమే! అన్న ఇంకొక పెద్దమనిషి మాటలకు అక్కడ చేరిన వారందరూ
ఆమోదిస్తున్నట్టు గలగలా నవ్వారు.
చిన్నగా నవు్వతూ గ్రామపెద్దలకు వీడ్కోలు పలికి శివదాసు ముందుకు అడుగులు వేస్తున్నాడేగాని,
హెచ్చరికల్లాంటి వారి మాటలు విన్న తరవాత ఆయన మనసులో అలజడి మొదలయింది.
అంతర్మథనం ఆరంభమయింది. ఆ గందరగోళంలో రాజధాని కేసి వెళ్ళకుండా గంగానదీ తీరం
చేరాడు. నదిని చూడగానే ధారలు ధారలుగా కన్నీరు కారసాగింది. ``తల్లీ, నన్ను క్షమించు. నిన్ను
కీర్తిస్తూ, నీ మహిమను కొనియాడుతూ నేను కవిత్వం రచించింది ఎందుకు? దానిని అంకితమిచ్చి
రాజాశ్రయం పొందడానికా? భోగభాగ్యాలనుభవిస్తూ అహంకారినని పేరు తెచ్చుకోవడానికా? ఐహిక
సుఖాలకులోనై ఆప్తులకు దూరం కావడానికా? కాదు.
కానే కాదు. ఆ కవిత్వం మనిద్దరి మధ్య ఉన్న తల్లీ కొడుకుల అనుబంధానికి సంకేతం! దానిని
ఎవరూ మెచ్చుకోనవసరం లేదు. ఎవరి సన్మానాలూ అవసరం లేదు. నీకే సమర్పిస్తున్నాను.
స్వీకరించి నా అపరాధాన్ని క్షమించు, అంటూ కళు్ళ మూసుకుని తాళ పత్రాలను ఒక్కొక్కటిగా
నదిలోకి జారవిడిచాడు. తాళపత్రాలన్నిటినీ గంగామాతకు సమర్పించాక, కళు్ళ తెరిచిన
శివదాసుకు ఒక అద్భుత దృశ్యం గోచరించింది. ఆయన విడిచిన తాళపత్రాలన్నీ సువర్ణ పత్రాలుగా
మారాయి.
అవి ప్రవాహ వేగానికి కొట్టుకు పోకుండా శివదాసుకు చేరువగా నీళ్ళపై తేలియాడసాగాయి. ఆ దృశ్యం
చూసిన శివదాసుకు అది నిజమా? కలా? అన్న సందేహం కలిగింది. ఒక పత్రం అందుకుని
చూశాడు. అతని పద్యం అందులో అందంగా లిఖించబడి ఉన్నది! అదే సమయంలో,
``పదిమందికీ చేరువయినప్పుడే ఏ కళకైనా సార్థకత సిద్ధిస్తుంది. అమృత తుల్యమైన నీ కవిత్వమూ
అంతే. అనవసరమైన అయోమయం వదిలిపెట్టి కొంచెం సంయమనం పాటించు.
అంతా శుభమే జరుగుతుంది, అన్న మృదువైన కంఠస్వరం వినిపించింది. శివదాసు పత్రాలన్నిటినీ
తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని వెనుదిరిగాడు. దూరంలో జమీందారు పరివారంతో రావడం
కనిపించింది. ఆయన శివదాసును సమీపించి, ``యథాలాపంగా ఉద్యానవన భవనానికి వచ్చిన
నాకు, మీరు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఎదురు చూశాను. కొంత సేపయ్యాక నౌకర్లు వచ్చి
తమరు ఇక్కడ ఉన్నట్టు చెప్పారు. గంగామాత తమ కవిత్వాన్ని ఆశీర్వదించిన అద్భుత ఉదంతం
విని పరవశించాను.
రండి వెళదాం, అన్నాడు. ``క్షమించండి. నేను ఎక్కడికీ రాలేను. కరుణించి ఇక్కడ ఒక కుటీరం
నిర్మించి ఇవ్వండి చాలు, అన్నాడు శివదాసు. జమీందారు ఆయన కోరికను నెరవేర్చి, రాజధానికి
వెళ్ళి శివదాసు తాళపత్రాలను స్వర్ణ పత్రాలుగా మార్చిన గంగామాత అద్భుత మహిమ గురించి
రాజుకు చెప్పాడు.
సాహితీ ప్రియుడైన రాజు స్వయంగా వచ్చి శివదాసును కలుసుకుని స్వర్ణతాళపత్రాలలోని
కవిత్వాన్ని చదివి వినిపించమని విని తన్మ యత్వం చెందాడు. ఆస్థానకవి పదవిని
అలంకరించమని ఆహ్వానించాడు. అయితే, శివదాసు, ``గంగామాతకు ఈ నదీ తీరాన ఒక గుడి
కట్టించి, ఆ జ్ఞానగంగను సేవిస్తూ ఇక్కడే ఉండిపోయే భాగ్యం నాకు కలిగించండి. మీ మేలు
మరిచిపోను, అని వేడుకున్నాడు. త్వరలో అక్కడ స్వర్ణపత్రాలుగల జ్ఞానగంగ ఆలయం
నిర్మించబడింది. శివదాసు అక్కడే నిరాడంబరంగా జీవిస్తూ మరిన్ని కృతులు రచించి ప్రజలకు
అందించాడు.