సింహం -
తోడేలు - నక్క
అనగా అనగా ఒక పెద్ద అడవి వుంది. అందులో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక తోడేలు దాని భార్యా పిల్లలతో కలిసి వుంది. ఈ తోడేలు దాని కాపురం ఒక గుహలో పెట్టింది. అవి పగలంతా అడవిలో తిరిగి ఆహారము తినేవి. రాత్రి వేళలో గుహను చేరి విశ్రాంతి తీసుకునేవి. అలా రోజులు గడుస్తున్నాయి. వానాకాలం మొదలయింది. ఆ సంవత్సరం వానలు విపరీతంగా కురిశాయి. ఆ వానల వలన వాగులు పొంగి వరదలు వచ్చాయి. ఆ అడవి సగం నీటితో నిండిపోయింది. అందులో తోడేలు గుహ కూడా వుంది. దాని కుటుంబానికి ఆహారం దొరకటం కూడా కష్టమయింది. వాటికి ఏమి చేయటానికీ పాలుపోలేదు. అచటి నుండి అవి బయలుదేరి మంచి గుహ కోసం
వెతకటం మొదలు పెట్టినాయి. తోడేలు తన భార్యతో ;మనకు చాలా చెడు రోజులు వచ్చినాయి. ఆహారము లేదు సరికదా! మన పిల్లలు వానకు తడిసి పోతున్నారు. ఇపుడేమి చేద్దాం?; అని అంది. ఆడ తోడేలు చాలా తెలివిగలది. అది బాగా ఆలోచించింది. అచటకు దగ్గరలో ఒక గుహ వుంది. దానిలో ఒక సింహం వుంది. అది విశాలమైన గుహ. బాగా ఆలోచించగా ఈ విషయం ఆడ తోడేలుకు గుర్తుకు వచ్చింది. దానిలో ఎంత కాలమైనా హాయిగా వుండవచ్చు అనుకుంది. ఈ ఆలోచన మగనికి చెప్పింది. అది విని తోడేలు మండిపడింది. ;వుండీ వుండీ మనమంతా సింహానికి
ఆహారమవుదామా?; అంది. ఆడ తోడేలు ఒక మంచి పథకము ఆలోచించింది. ఏమి చేయాలో వివరంగా మగ తోడేలుకు చెప్పింది. ఆ పథకానికి తోడేలు సంతోషించింది. ఆ పనికి పూనుకుంది. మగ తోడేలు,ఆడ తోడేలు వాటి పిల్లలు అన్నీ కలిసి సింహం గుహ ముందుకు చేరాయి. మగ తోడేలును, పిల్లలనూ చాటుగా వుండమంది. అచట ఒక చెట్టు చాటున అవి వున్నాయి. ఆడ తోడేలు ఒక్కటీ నెమ్మదిగా ఆ గుహద్వారము దగ్గరకు చేరింది. అచట చప్పుడు
యేమీ వినపడలేదు. ఆడ తోడేలు నెమ్మదిగా గుహలోకి తొంగి చూసింది. అచట ఎవరూ కనపడలేదు. గుహ అంతా ఖాళీగా వుంది. నెమ్మదిగా గుహలోపలికి వెళ్ళి అంతా కలియ తిరిగింది. ఎటువంటి అలికిడీ లేదు. సింహం అప్పుడు గుహలో లేదు. బయటకు ఆహారము కోసం వెళ్ళింది. గుహ విశాలంగా చాలా బావుంది. సింహం ఆహారం తిని రాత్రి వేళకు వస్తుందని అర్థమైంది. తోడేలు తన భర్తనూ, పిల్లలనూ లోపలికి రమ్మని సైగ చేసింది. వారంతా లోపలికి చేరారు. పగలంతా అడవిలో తిరిగి ఆహారము తిని చీకటి పడగానే సింహం గుహకు వస్తే, ఏమి చేయాలో మగ తోడేలుకు చెప్పి గుహ బయటనే కాపలా వుంచింది. చీకటి పడసాగింది. దూరము నుంచి సింహం రావటం
చూసింది. సింహం గుహకు దగ్గరగా రాగానే మగ తోడేలు గుహలోకి వెళ్ళింది. ఆడ తోడేలు పిల్లలను గబ గబా నాలుగు దెబ్బలు కొట్టింది. అవి పెద్దగా ఏడవటం మొదలు పెట్టినాయి. మగ తోడేలు, ఆడ తోడేలు కలిసి విచిత్రంగా అరవటం మొదలు పెట్టాయి. ఆ అరుపులూ, కేకలూ వింటుంటే సింహానికి కొంచెం భయమేసింది. ఏదో పెద్ద జంతువు నా గుహలోకి చేరిందేమో అనుకుంది. అది గుహలోకి వెళ్ళకుండా బయటనే వుంది. సింహం ద్వారం వద్ద నిలబడి వుండటం చూచింది. ఆడ తోడేలు ఇలా అరవసాగింది. ;పిల్లలు ఏడుస్తున్నారు. వారికి సింహం మాంసం వండి పెట్టాలట! లేకపోతే తిండి తినరట. గోల పెడుతున్నారు. ఇపుడు నేను యేమి చేసేది? ఇప్పటికిప్పుడు సింహపు మాంసం కావాలంటే ఎలా వస్తుంది? నేను ఎక్కడి నుండి తీసుకురాను.; అంది. దానికి మగ తోడేలు యిలా అంది ;తొందరపడకు ఒక సింహం యిటు రావటం చూశాను. అది బాగా బలిసి వుంది. దాని మాంసం బాగా రుచిగా వుంటుంది. అది యీ వైపుకి రాగానే దానిని చంపి దాని మాంసం తీసుకువస్తాను; అని గట్టిగా అరిచింది. ఈ మాటలు సింహం వింది. దానికి బాగా దడ పుట్టింది. లోపల యే జంతువులు వున్నాయో సింహానికి అర్థం కాలేదు. అవి తనను
చంపుతాయేమో అనుకుంది. వెనుకకు చూడకుండా చాలా దూరం వెళ్ళింది. తోడేళ్ళ సంసారం గుహలో చేరటం అచట వుండే ఒక నక్క చూసింది. తోడేళ్ళ సంభాషణ అంతా వింది. సింహం పరుగు తీయటం చూసింది. తోడేళ్ళ సాహసానికి నక్క ఆశ్చర్యపోయింది. తోడేళ్ళు సింహాన్ని మోసం చేసి గుహనుంచి తరమటం గమనించింది. తోడేళ్ళకి ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. సింహం కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. అన్ని చోట్లా గాలించింది. దానికి సింహం దగ్గరలో ఎక్కడా కనపడలేదు. నక్క చాలా దూరం వెళ్ళి అంతా వెదికింది. చివరకు ఒక గుట్ట చాటున సింహం పడుకుంది. అది బాగా రొప్పుతోంది. నక్క మెల్లిగా సింహం దగ్గరకు చేరింది. ఇలా అంది. ;ఓ మృగరాజా! నీవు ఈ అడవికి రాజువు. నీలాంటి వారు ఒక తోడేలుకి యిలా భయపడటం సబబేనా?నీలాంటి నాయకులు అలా పరుగు తీయవచ్చునా? రేపు యీ విషయం మిగిలిన జంతువులకి తెలిసిన నీ పరువు వుంటుందా; ఈ మాటలకి సింహం యే సమాధానం చెప్పలేదు. దానికి భయం యింకా తగ్గలేదు. నక్క మాటలు సింహం అసలు నమ్మలేదు. నక్క మరలా యిలా అంది. ;ఓ రాజా! ఆ తోడేలును నీ గుహనుంచి వెళ్ళగొడతాను. నీవు నాతోరా ;సింహం తనలో తాను ఇలా అనుకుంది. ఇది అసలే నక్క దీనిని అసలు నమ్మరాదు. దీనితో వెళితే ఇది నన్ను గుహ దగ్గరకు తీసుకెళ్ళి అచటనే వదలిపెడుతుంది. అపుడు నేనేం చేయాలి? ఆ జంతువుని చూసి నక్క పారిపోతే? ఇంతలో సింహానికి ఒక ఉపాయం
తట్టింది. ;ఓ నక్కా! నేను నిన్ను నమ్మను. నేను చెప్పింది చేస్తే నీతో రావడానికి ఒప్పుకుంటాను; అంది. నక్క అది యేమిటో చెప్పమంది. ;నా తోకతో నీ తోకను ముడివేసుకొని యిద్దరం వెళదాం సరేనా; అంది. దీనికి నక్క ఒప్పుకుంది. ఆ తోడేళ్ళు యేమి చేయలేవని నక్క ఆలోచన. సింహం, నక్క తోకలు ముడివేసుకొని గుహ వద్దకు చేరుకున్నాయి. సింహం, నక్క కలిసి రావడం ఆడతోడేలు చూసింది. నక్క యేదో ఎత్తు వేసిందని ఆడతోడేలు ఊహించింది. తోడేలు గుహముందుగా వచ్చి పక్కకు నిలబడింది. ;ఏం నక్కా నేను రెండు సింహాలను తెమ్మంటే, ఒక్క
దాన్నే తెచ్చావేమి? సరే ముందు నిన్ను చంపుతాను. తరువాత సింహాన్ని కూడా చంపి ఆ రెండింటినీ కలిపి వండుకు తింటాను; అని అరిచింది. ఆ మాటలు సింహం వింది. నక్క తనని మోసం చేసిందని భావించి వెనుకకు తిరిగి వేగంగా పరుగెత్తింది. ఆ పరుగులో నక్క శరీరం చీరుకుపోయింది. తోక తెగి, అది క్రిందపడి చనిపోయింది. ఇదంతా చెట్టుపైన వున్న ఒక కోతి చూచింది. నెమ్మదిగా ఆ కోతి సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క చెప్పినట్లే చెప్పింది. మెల్లిగా సింహాన్ని ఒప్పించింది. సింహం కోతితో యిలా అంది ;నీవు తాడుతో నా మెడకు నీ మెడకు కట్టు. అప్పుడు వెళ్ళుదాం; అంది. అలాగే చేసింది. ఆ రెండూ తాడుతో మెడలు కట్టుకున్నాయి. నెమ్మదిగా గుహ దగ్గరకు వెళ్ళినాయి. రెంటిని ఆడతోడేలు చూసింది. ఆడతోడేలు నక్కని అరచినట్లే ;ఓసీ కోతి! పొద్దుననగా సింహాన్ని తీసుకువస్తానని ఇంతరాత్రికి
వస్తావా? ముందు నిన్ను చంపి, తరువాత సింహాన్ని చంపుతాను; అంది పెద్దగా. ఈ మాటతో సింహానికి వణుకు పుట్టింది. అది వెనుకకు తిరిగి పరుగులంకించుకుంది. దానితో పాటు కోతి కూడా పరుగెత్తాల్సి వచ్చింది. అవి రెండూ అలా పరుగెత్తి ఒక దిగుడు బావిలో పడి చనిపోయాయి. అందుకే పెద్దలు అంటారు ;బుద్ధిబలం వుంటే బలహీనులు కూడా బలవంతులను జయించవచ్చును; అని.