రాము సోముల కథ

రాము సోముల కథ

SHYAMPRASAD +91 8099099083
0


రాము సోముల కథ
ఒక ఊరిలో కోనయ్య - పార్వతమ్మ అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఇద్దరు మగ
పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టగానే పార్వతమ్మ చనిపోయింది. కోనయ్య పిల్లలను పెంచలేక ఒక పెద్ద
అడవిలో వదలి వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరూ అడవిలో ఆకలితో ఏడుస్తుండగా విని, అడవిలోని
ఏనుగొకటి అక్కడికి వచ్చి ఒక అబ్బాయిని తీసుకు పోయింది. మరొక పిల్లవాణ్ని కోయవాళ్ళు వచ్చి
తీసుకు పోయారు. ఏనుగు దగ్గర ఉన్న వాని పేరు రాము. కోయవాళ్ళ దగ్గర ఉన్నవాని పేరు సోము.
రాము అడవిలోని జంతువులన్నింటితోటీ స్నేహంగా ఉండేవాడు. అడవిలోని జంతువులు, పక్షులు
ఏవైనా ప్రమాదంలో ఉంటే వెళ్ళి కాపాడేవాడు.
ఒకసారి ఇంగ్లీషువాళ్ళు కొందరు అడవిని చూడటానికి వచ్చారు. వారిలో ఒకావిడ , ఒకనాటి రాత్రి
అడవిలోకి వెళ్లింది. ఒక సింహం ఆమెపై దాడి చేస్తుండగా, రాము వెళ్ళి ఆమెను కాపాడాడు. ఆమెను
వాళ్ల ఇంటికి తీసుకెళ్ళి, గాయాలకు పసరులు రాసి, గాయాలను బాగుచేసి పంపాడు.
ఇక సోము కోయవాళ్ల దగ్గర యుద్దం చేయడం, జంతువులను వేటాడటం లాంటి విద్యలన్నీ
నేర్చుకున్నాడు. ఒకసారి సోము వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ అతను ఒక జింకను చంపటానికి
ప్రయత్నిస్తుండగా, అది గమనించిన రాము జంతువులను చంపరాదని అడ్డుపడ్డాడు. సోము
కోపంగా తనకు అడ్డురావొద్దనీ, అది తన వృత్తి అనీ చెప్పాడు. అయినా రాము ఒప్పుకోలేదు. అలా
వేటాడటానికి వీలు లేదన్నాడు. ఇద్దరి మధ్యా గొడవ మొదలై యుద్దానికి దారితీసింది. వారిద్దరూ
పోట్లాడుకుంటుండగా, ఏనుగూ, కోయవాళ్ళూ వచ్చి వారిని ఆపారు. రూపు రేఖలు ఒకేలా ఉండటం
చూసి, వారిద్దరూ అన్నదమ్ములేనని తేల్చారు. అప్పటినుండీ వారిద్దరూ కలసి అడవిని బాగా
కాపాడుకోవటం మొదలుపెట్టారు.
అంతలో ఒకసారి, కొందరు దుండగులు అడవికి ఏనుగు దంతాలకోసం వచ్చారు. ఏనుగులను
వేటాడటం చూసిన రాము, సోములు వారిని అడ్డుకున్నారు. కోయవాళ్ల సహాయంతో వారిని
అక్కడినుండి తరిమేశారు.
మరోసారి అడవిలో వజ్రాలు దొరుకుతున్నాయని అక్కడికి సిటీ ప్రజలు చాలామంది వచ్చారు.
వజ్రాలు దొరికే గుహ దగ్గర వారంతా చేరి, నానా గందరగోళం చేశారు. దాంతో ప్రశాంతంగా ఉండే
అడవంతా గోల గోలగా మారిపోయింది. అది సహించలేని రాము, సోములు వారిని అక్కడినుండి
పంపేసే ప్రయత్నం చేశారు. వారు వినలేదు. పైగా రాము, సోముల మీదికే యుద్దానికి
దిగారు.అప్పడు అడవిలోని జంతువులూ, కోయవాళ్ళూ వచ్చి వారందరినీ అక్కడినుండి
తరిమేశారు.
అప్పుడు సోము వజ్రాలెలా ఉంటాయో తను చూసి వస్తానని గుహలోకి వెళ్ళాడు. అంతే! అతను
కూడా వజ్రంలా మారిపోయాడు. ఎంతకీ బయటికి రాడేమని కోయవాళ్లు ఒక్కొక్కరూ లోపలకు
వెళ్ళారు. వెళ్లినవారు అందరూ వజ్రాలుగా మారిపోయారు. లోపలికి వెళుతున్నవారంతా
ఏమవుతున్నారని రాము ఆలోచించి కంగారు పడ్డాడు. తను లోపలికి వెళ్ళకుండా వారిని కాపాడటం
ఎలాగని యోచించాడు. మార్గం కానక పిచ్చివానిలా అడవిలో తిరుగుతున్న రాముకు ఒక గొప్ప ఋషి
కనబడ్డాడు. తన వాళ్లను కాపాడుకొనే ఉపాయాన్ని అతనికి వివరించి వెళ్ళాడు. అదేమంటే
గుహకున్న మూడో ద్వారం గుండా లోపలికి వెళ్ళి, అక్కడుండే ప్రమాదకరమైన దెయ్యాలను
చంపేసి, వాటి రక్తాన్ని వజ్రాలపై చల్లాలి. అప్పుడు వజ్రాలుగా మారిపోయిన జంతువులన్నీ వాటి
పూర్వ రూపాన్ని పొందుతాయి!
రాము వెంటనే గుహను చేరుకున్నాడు. కానీ అతనికి అక్కడ ఒక్కటే దారి కనబడింది. మిగిలిన
దారులను వెదుకుతుండగా అతనికి చాలా దాహం వేసింది. దగ్గరలోని వాగు దగ్గరికి వెళ్ళి నీళ్ళు
తాగుతుంటే, అతనికి వాగులో కొట్టుకుపోతున్న చీమల గుంపొకటి కనబడింది. చాలా వేగంగా పారే
వాగు ప్రవాహం లోకి దూకి చీమల గుంపును కాపాడాడు రాము. తమను పెద్ద ప్రమాదం నుండి
కాపాడిన అతనికి కృతజ్ఞతలు చెప్పి, అందుకు ప్రతిఫలంగా అతనికి ఏమి కావాలో చెప్పమన్నాయి
చీమలు. గుహకున్న మూడో ద్వారాన్ని చూపమన్నాడు రాము. చీమలన్నీ గుహ దగ్గరికెళ్ళి, తలా
ఒకదారిన అన్ని చోట్లా వెదికి చివరికి మూడో ద్వారాన్ని కనిపెట్టటమే కాక, అక్కడి పరిస్తితులను
సైతం రాముకు వివరించాయి.
అంతా తెలుసుకున్న రాము ఒక చక్కని పథకాన్ని తయారు చేసుకొని మిగిలి ఉన్న కోయవాళ్ళూ,
జంతువుల సాయంతో మూడోద్వారం గుండా లోనికి ప్రవేశించాడు. అక్కడి దెయ్యాలన్నింటినీ
చంపి, వెంటనే వాటి రక్తాన్ని వజ్రాలమీద చల్లాడు. అంతే! వజ్రాలన్నీ జంతువులుగానూ,
కోయవాళ్ళగానూ మారిపోయారు.
అంతా కలసి ఆనందంగా అడవిని చేరుకున్నారు. ఇంతలో నన్ను సింహం బారినుండి కాపాడిన
రామును పెళ్ళి చేసుకుంటాన ని ఇంగ్లీషావిడ అక్కడికి వచ్చింది. విషయాన్ని ఆమె ఇంగ్లీషులో
చెప్పింది. కానీ మాటలు అడవిలోని చిలకకు తప్ప మరెవ్వరికీ అర్థం కాలేదు.
చివరికి ఇంగ్లీషావిడ మాటలన్నింటినీ చిలుక తెలుగులోకి అనువదించి చెప్పవలసి వచ్చింది.
తెలుగేరాని ఆమెను రాము ఎలా పెళ్ళిచేసుకుంటాడని అందరూ అన్నారు. మాటలను చిలుక
ఆమెకు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి చెప్పింది. అందుకామె తను నెలలోగా తెలుగు నేర్చుకుంటానని
ఖచ్చితంగా చెప్పింది. నిజంగానే నేర్చుకుంది కూడానూ! ఆపైన, ఆమె తమ పెద్దలకు కూడా
జరిగినదంతా చెప్పి, తనకూ, రామూకూ పెళ్ళి చేయమని కోరింది. అందుకు వాళ్ళు కూడా
ఒప్పుకుని రాముకూ, ఆమెకూ వివాహం జరిపించారు. అదే సమయంలో వారి రెండవ అమ్మాయిని
సోముకు ఇచ్చి పెళ్ళి చేశారు.
రాము, సోముల పెళ్ళిళ్ల సందర్బంగా అదవిలోని నెమళ్ళు నాట్యం చేశాయి. ఏనుగులు సర్కస్
చేశాయి. గొరిల్లాలు, చింపాంజీలూ అటూ ఇటూ పరుగులు తీశాయి. కోయిలలు పాటలు పాడాయి.
సింహాలూ, పులులూ డోలు కొట్టాయి. కాకులూ, పిచ్చుకలూ మేళం ఊదాయి. మైనా మంత్రాలు
చదివింది.
తరువాత రాము సోములు అడవిని, జంతువులను కాపాడుకుంటూ సుఖంగా జీవించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!