రామయ్య కోరిక
వెంకటాపురంలో కూలిపనులు చేసుకుని బతికే రామయ్యకు నలుగురు సంతానం. ఆ ఊళ్ళో
కూలిపనులు రోజూ దొరకవు. దొరికినా వచ్చే ఆదాయం తక్కువ. కడుపునిండా తినడానికి తిండీ,
కట్టుకోవడానికి బట్టా లేకుండా ఇంటిల్లిపాదీ ఉసూరుమంటూ బతుకీడుస్తున్నారు. ఒకనాటి రాత్రి
రామయ్యకు గారెలు తింటున్నట్టు కలవచ్చింది. నిద్రలోనే నోరూరింది. లేవగానే భార్య మంగమ్మతో
తన కలగురించి చెప్పాడు.
మంగమ్మ నిట్టూర్చి, ``గంజినీళ్ళకు గతిలేదు గానీ, గారెల ముచ్చట ఒకటి మనకు, అన్నది. ఆ
తరవాత ముంతలో నూకల గంజి తెచ్చి భర్త ముందుంచి, ``పట్నం పోయి ఏదయినా పని
చూసుకోమంటే నా మాట వినవు. నూతిలోని కప్పలా ఈ ఊళ్ళోనే ఉంటే మన బతుకు ఇలాగే
ఉంటుంది, అన్నది.
రామయ్యకు ఉన్న ఊరు వదిలి వెళ్ళాలంటే అయిష్టం, బెరుకూను. అందుకే భార్య అలా
అన్నప్పుడల్లా, ``చూద్దాంలే, అంటూ మాట దాటవేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే సమాధానం
చెప్పి, కాళు్ళ చేతులు కడుక్కుని రావడానికి పెరట్లోకి వెళ్ళాడు. ఈలోగా పక్కింటి రైతు వెంకయ్య
ఏడు నెలల కొడుకు పాక్కుంటూ వచ్చి, అక్కడ ఉంచిన ముంతను తోసి గంజిని ఒలకబోసేశాడు.
అది చూసి, ``నీవల్ల ఈ గంజినీళు్ళ కూడా నాకు ప్రాప్తం లేకుండా పోయాయి గదరా, అని
విసుక్కున్నాడు రామయ్య. ``పోనీ లేవయ్యా, పాపం పసిబిడ్డ. వాడికేం తెలుసు. ఇప్పుడిప్పుడే
పాకడం నేర్చుకుంటున్నాడు. మనమే జాగ్రత్తగా ఉండాలి, అన్నది మంగమ్మ. ఆకలి కడుపుతోనే
రామయ్య ఊళ్ళోకి పనికోసం బయలుదేరాడు. ఆ పూట ఎక్కడా పని దొరకలేదు.
కరణం గారి ఇంటి ముందు నుంచి వస్తూంటే, గారెలు వేగుతూన్న వాసన వాళ్ళింటి నుంచి కమ్మగా
వీచింది. రామయ్యకు నోరూరింది. అప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తూన్న కరణంగారితో,
``అయ్యా, ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను, అన్నాడు. ``ఈ రోజు మా తండ్రిగారి ఆబ్దీకం.
అందరం హడావుడిగా ఉన్నాం.
సరే, నువు్వ నూతిలోంచి నీళు్ళ తోడి ఆ తొట్టె నింపు, అని చెప్పి కరణం లోపలికి వెళ్ళిపోయాడు.
పాతాళంలో ఎక్కడోవున్న నీళ్ళన్నీ, శ్రమపడి తోడి తొట్టె నింపాడు రామయ్య. గంట తరవాత
కరణంగారి భార్య, రెండు రూపాయలు రామయ్య చేతిలో పెట్టి, ఇక వెళ్ళమన్నది. ``అమ్మగారూ,
రెండు గారెలుంటే పెట్టండి, అని నోరు తెరిచి అడిగాడు రామయ్య. ``అయ్యో, గారెలెక్కడ
మిగిలాయిరా! వచ్చిన వాళ్ళే తినేశారు, అన్నది ఆమె. రామయ్య నిరాశపడి నూకలు కొనుక్కోవడం
కోసం, శెట్టి దుకాణానికి వెళ్ళాడు. ``ఒరేయ్�, రామయ్యా, మా ఆవిడ గారెల కోసం పిండి
రుబ్బుతోంది.
నాలుగు గారెలు తిని వెళుదువుగానీ, ఈలోగా వాకిట్లోని ఆ బస్తాలు తీసుకువచ్చి లోపల సర్దు
నాయనా, అన్నాడు శెట్టి. రామయ్య మహదానందంతో, బస్తాలన్నీ మోసుకొచ్చి ఇంట్లో పడేశాడు.
తీరా ఆ పని అయ్యేసరికి, పిండి రుబ్బుతూన్న శెట్టి భార్యను, రోలు కిందినుంచి బయటకొచ్చిన ఒక
తేలు కుట్టింది.
ఆవిడ లబోదిబో మంటూంటే, శెట్టి ఇంటికి తాళం వేసి, భార్యను తీసుకుని వైద్యుడి వద్దకు
పరిగెత్తాడు. ``నా అదృష్టం ఎంత నవు్వలాటగా తయారయిందో, అనుకుంటూ రామయ్య నూకల
సంచీతో ఇల్లు చేరాడు. మంగమ్మ బాదం ఆకులో ఆరు గారెలు తీసుకొచ్చి భర్తకు అందిస్తూ, ``నీ కల
నిజం అయిందిలే.
తిను, అన్నది నవు్వతూ. రామయ్య గారెలను చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ, ``ఎక్కడివి?
ఎలా వచ్చాయి? అని అడిగాడు. ``పక్కింటి వెంకయ్య కొడుకు పాకుతున్నాడు కదా. పిల్లలు గడప
దాటితే గారెలు వండటం అన్నది మనవాళ్ళ ఆచారం. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ. అందుకే
వెంకయ్య భార్య గారెలు చేసి, మనకు కూడా ఇచ్చింది, అన్నది మంగమ్మ. ``మరి మన పిల్లలకూ,
అని అడిగాడు రామయ్య. ``నీకు ఇష్టం అని నీ కోసమే దాచాను. వాళు్ళ రాకముందే తినెయ్�,
అన్నది మంగమ్మ. రామయ్య కళు్ళ చెమ్మగిల్లాయి.
గారెలను భార్యకు తిరిగి ఇస్తూ, ``వద్దులే. వాళూ్ళరానీ. పిల్లలతో కలిసి అందరం తలా ఒకటి
తిందాం, అన్నాడు. ఈలోగా వెంకయ్య కొడుకు పాక్కుంటూ వచ్చి, రామయ్య కేసి చూసి బోసి నవు్వ
నవ్వాడు. రామయ్య వాణ్ణి ఎత్తుకుని ముద్దాడుతూ, ``పసిబిడ్డ దోగాడుతూ గడపదాటితే అదొక
ఆనందం, వేడుక. సంపాదించ వలసిన మగవాడు గడపదాటకపోతే అది అరిష్టము, అవకరమూను.
అందునా అధిక సంతానంతో అవస్థలు పడుతూన్న నేను, రేపు పిల్లల మంచి చెడుల గురించి
పట్టించుకోకుండా, సంపాదన లేని ఈ ఊళ్ళోనే ఉండిపోవడం అవివేకం. అందుకే నువ్వన్నట్టుగానే
నేను పట్నం పోదామని అనుకుంటున్నాను. రేపు తెల్లవారు జామునే లేపు, అన్నాడు భార్యతో. భర్త
మాటలకు మంగమ్మ ముఖం కళకళలాడింది.