నిదానమే ప్రధానం
ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు. అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతులదగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకునిరమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి "బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - "నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది" అనిబదులిచ్చాడు. రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకుకొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటిగ్గాని అర్ధంకాలేదు. ఆ సంఘటనలో రంగా తన జీవితానికిసరిపడా గునపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు.