✅తెలుసు కుందాం 1✅
🔴స్థిర విద్యుత్ అంటే ఏమిటి? దానిని ఎలా తయారు చేస్తారు?
✳చాలా కాలం క్రితం గ్రీకు దేశస్థుడొకరు ఏంబర్ (Amber) అనే జిగురు పదార్థాన్ని పీచుతో రుద్దినప్పుడు అది తేలికైన ఎండుటాకులను, రంపం పొట్టును ఆకర్షించడాన్ని గమనించాడు. ఏంబర్‌ను గ్రీకు భాషలో 'ఎలక్ట్రా' అంటారు. అది ప్రదర్శించిన ఈ ధర్మాన్ని బట్టే 'ఎలక్ట్రిసిటీ' అనే పేరొచ్చింది.
ఏదైనా కాగితాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఓ దువ్వెనను గట్టిగా రుద్ది వాటికి దగ్గరగా పెడితే అవి ఆకర్షితమవడాన్ని గమనించవచ్చు. అలాగే గాజు కడ్డీని సిల్కు బట్టతో రుద్దితే గాజుకడ్డీపై విద్యుదావేశం పుడుతుంది. చలనం లేని ఈ విద్యుత్‌నే 'స్థిరవిద్యుత్తు' (Static electricity) అంటారు.
పదార్థాలన్నీ పరమాణువుల (Atom) మయం అని తెలిసిందే. ఒక వస్తువును మరొక వస్తువుతో రుద్దడం ద్వారా కలిగిన ఘర్షణ వల్ల వాటిలోని పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించడమో, కోల్పోవడమో జరుగుతుంది. అప్పుడు ఆ వస్తువులపై స్థిరవిద్యుత్ ఏర్పడుతుంది. ఆకాశంలో మేఘాలు ఒకదానినొకటి రాసుకున్నప్పుడు కూడా స్థిరవిద్యుత్ ఏర్పడుతుంది. అలా పోగుపడిన విద్యుత్ భూమి దిశగా ప్రసరించినప్పుడే మెరుపులు వస్తాయి.
పదార్థాల్లోని ప్రతి పరమాణువులో ధనావేశముండే ప్రోటాన్లు, రుణావేశముండే ఎలక్ట్రాన్లు సమాన సంఖ్యలో ఉంటాయి. ఈ విద్యుదావేశాలు సమానమవడం వల్ల వీటి ప్రభావం చుట్టుపక్కల వస్తువులపై ఉండదు. అదే ఒక వస్తువును మరో వస్తువుతో రుద్దినప్పుడు ఎలక్ట్రాన్ల మార్పిడి జరుగుతుంది. ఎలక్ట్రాన్లను కోల్పోయిన వస్తువుపై ధనావేశం, ఎలక్ట్రాన్లను గ్రహించిన వస్తువుపై రుణావేశం ఏర్పడుతాయి. గాలి ఊదిన బెలూన్‌ను చొక్కాకు రుద్దినప్పుడు అది అంటుకోవడం, టీవీ తెరను తుడిచేప్పుడు మన చేతి మీది వెంట్రుకల్ని ఆకర్షించడం లాంటి పరిణామాలకు ఇదే కారణం.