ఏనుగులకు కులాలున్నాయి.
................................................
పూర్వంకాల యుద్ధంలో చతురంగబలాలు ప్రముఖమైనవి. రథగజతురగ పదాతి దళాలను చతురంగబలాలనేవారు.
రథబలం ఇప్పటికి 2000 సం॥ క్రిందటనే యుద్ధరంగంలో అదృశ్యమైంది. గజబలం 18 వ శతాబ్దంనాటికి రణరంగంలో అంతమైంది.ఇక తురగ అంటే అశ్వబలం 19వ శతాబ్దినాటికి యుద్ధరంగంనుండి తప్పుకొంది. అప్పటికి నిలచినది, ఇప్పటికి మరెప్పటికైనా నిలిచివుండేది పదాతిదళమే.
గత యుద్ధాలలో ఏనుగులు ఏంచేసేవో చూద్దాం.
ఉపస్థానం - కంచెలు ధ్వంసం చేయడం, మిట్టలను దాటటం.
సంవర్తనం - అవసర సమయాలలో ఏనుగు ఎత్తు తగ్గించుకొని కూర్చుంటే యోధుడు యుద్ధం చేయడం.
సంయానం - చక్కగాపోతూ, అకస్మాత్తుగా వంకరగా తిరగటం.
వధావధం - యుద్ధంలో రథాలను గుర్రాలను పదాతులను కాళ్ళతో తొక్కివేయడం.
హస్తిపోరు - శత్రుఏనుగులతో పోరాడటం.
నాగరాయణం - నగరద్వారములను, భవనములను, కోటగోడలను కూలద్రోయటం..
సాంగ్రామికం - అన్ని రకాల యుద్దాలలో పాల్గొనడం.
సుశిక్షితుడైన మావటివాడు అంకుశం ధరించి కుంభస్థలం మీద కూర్చుని ఏనుగును అదుపు చేస్తాడు. కొన్ని సందర్భాలలో ఏనుగులు యుద్ధరథాన్ని లాగితే రథకుడు అంబారిలో వుండి పోరుచేసేవాడు.
రథికుడంటే రథాలను తయారుచేసేవాడు. రథాన్నితోలేవాడు సారథి.
అగ్నిపురాణం ప్రకారం ఆరుగురు యోధులు, ఇద్దరు విలుకాళ్ళు, ఇద్దరు ఖడ్ఖదారులు, ఇద్దరు గదాధరులు ఏనుగుపై కూర్చుని ఒకేసారి యుద్ధం చేసేవారు.
బ్రాహ్మణ: క్షత్రియో వైశ్య:
శూద్రశ్చేతి చతుర్విధా:
వర్ణా గజేషు విజ్ఞేయా
స్తేషాం లక్షణముచ్యతే
అనే శ్లోకాన్నిబట్టి చూస్తే మనవారు ఎంతో విజ్ఞతతో గజవిభజన చేసారు.అంటే ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ, అధమ అనే రకాలుగా వాటి సామర్థ్యాన్ని, రూపాన్ని, ఆకారాన్ని బట్టి వాటిని విభజన చేశారు.
కులాలపేర్లున్నంత మాత్రాన బ్రాహ్మణులు అధిరోహించే, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు ఎక్కే ఏనుగులని అనుకోరాదు.
ఇంకా
భద్రో మంద్రో మృగో మిశ్ర,శ్చతస్రో
జాతయో గజే అని నాలుగు రకాలుగా గజశాస్త్రకారులు ఏనుగులను విభజించారు.
భద్రగజం
మంద్రగజం
మృగగజం
మిశ్రగజం.
భద్రగజమంటే రాజులు అధిరోహించటానికి, దేవతా ఊరేగింపులకు, నైపుణ్యయుద్ధాలకు ఉపయోగపడేది.
మంద్ర అంటే బహుశా యుద్ధంలో పాల్గొనేది కావచ్చును.
మృగగజమంటే మొండిది, మృగంలా భీకరంగా యుద్ధంలో పాల్గొనేది.
మిశ్రమంటే సమయానుకూలంగా పరిస్థితులనుబట్టి ప్రవర్తించేది.
....................................................................................................... జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.