జీవితం 🌷🌺🌺🌺🌺🌺🌺
కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. బీచ్ అంతా రష్‌గా ఉంది.
"ఎలా ఉంది కొత్త సంసారం?" అని అడిగాడు తండ్రి.
కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది.
ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం అయింది. అందరూ కలిసి వాణ్ణి కొట్టబోయారు. పెద్దలు వచ్చి వాళ్ళను విడిపించి సర్ది చెప్పారు.
“…నిన్న రాత్రి చాలాసేపు మీరు ఏదో విషయంలో గొడవ పడుతున్నారు. అర్ధరాత్రి వరకూ మీ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి” తండ్రి అన్నాడు.
"అబ్బే అదేo లేదు మామయ్యగారూ" అంది కోడలు.
ఆయన నవ్వేడు. "మీకన్నా పాతికేళ్ళు పెద్దవాణ్ణి. నా దగ్గర దాచవద్దు. ఏ విషయంలో జరిగింది గొడవ?"
"నా కంప్యూటర్ ముట్టుకోవద్దని చెబుతూనే ఉంటాను. తనకి లాప్‌టాప్ ఉంది కదా. అనవసరంగా నా దాన్ని కెలుకుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి తయారు చేసుకున్న ఫైలు మొన్న డిలిట్ అయిపోయింది" నిష్ఠూరంగా అన్నాడు కొడుకు.
కోడలు వెంటనే "ఎంతో నీట్‌గా సర్దుకున్న నా షెల్ఫ్‌లో బట్టలన్నీ మొన్న మీరు చిందర వందర చేయలేదా? అయినా మీ వాచీ నా పట్టుచీరల మధ్యన ఎందుకుంటుంది?" అంది కోపంగా.
"పట్టుచీరలు చిందరవందర చేయటం, కంప్యూటర్‌లో ఫైలు డిలిట్ చేయటం ఒకటేనా?" అన్నాడు మరింత కోపంగా కొడుకు.
ముసలాయన నవ్వాడు. "నిన్న కూడా మీరు మొదట్లో చిన్న స్వరంతోనే మాట్లాడుకొని, ఆవేశం పెరిగాక పక్క గదిలో నేనున్నానని కూడా మర్చిపోయి నాకు వినిపించేంత గట్టిగా మాట్లాడుకున్నారు."
ఇద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. ఈలోపు అప్పటి వరకూ ఆడుకుంటూన్న పిల్లలు అక్కడ నుండి వెళ్ళిపోయారు. పెద్దాయన అటే చూస్తూ "ఆ పిల్లలు కొట్టుకోవడం చూశారు కదా. మీకేమైనా అర్థం అయిందా?" అని అడిగాడు.
అర్థం కానట్టు చూశారు ఇద్దరూ.
“ఎలాగూ కూలిపోయే ఇసుక గూళ్ళ కోసం, పిల్లలందరూ కొట్టుకున్నారు. చీకటి పడేసరికి, గూళ్ళని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. మన జీవితాలు కూడా అంతే. కొంతకాలం బ్రతుకుతాం. ఆపై అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. ఈ కొద్దికాలం ‘ఎంత సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండాలి’ అని ఆలోచించాలి తప్ప, డెలీటయిపోయిన ఫైళ్ళ కోసం, నలిగిపోయిన పట్టు చీరల కోసం కొట్టుకుని మనసులూ, జీవితాలూ పాడుచేసుకోకూడదు."
" వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం....." 💙💜💚❤️💗💓💕💖💞💘💌👣