🌸🌸🌸🌸🌸 ఆహ్వానం 🌸🌸🌸🌸🌸
అతను గేటు తలుపు తెరిచే ముందు క్షణం ఆగాడు. హృదయంలో
అలజడి.అతనొక క్షణం లోనికి అడుగు పెట్టాడానికి తటపటాయించాడు. తరువాత చెక్క గేటు
తీసుకొని లోనికి అడుగుపెట్టాడు.
ఇంటిని సమీపిస్తుంటే అతని హృదయం
అనిర్వచనీయమైన ఆనందానుభూతి నొందింది. "ఇది మా నాన్నగారిల్లు" అన్న ఫీలింగ్
హృదయ మంతా వ్యాపించి అతడిని ఉక్కిరి బిక్కిరి చేసింది. అతను ఆ ఇంటి తలుపును
కుడిచేత్తో మృదువుగా స్పృశించాడు. చనిపోయిన తండ్రిని తాకిన అనుభూతి కలిగింది.
మెల్లగా తలుపు తట్టాడు. "ఎవరు? "అన్న స్వరం లోపలనుంచి వినవచ్చింది. క్షణంపాటు తాను ఎవరని
చెప్పాలో తోచలేదు." నేను" అని గొణిగాడు. "ఎవరంటే మాట్లాడరేం?" అంటూ తలుపు తెరిచింది జానకమ్మ. ఎదురుగా వున్న యువకుడిని
కళ్లజోడు సరిచేసుకుంటూ తేరిపార చూసి "ఎవరు నువ్వు?" అని అడిగింది జానకమ్మ.
అతని హృదయంలో ఒక్కసారిగా రకరకాల
జ్ఞాపకాల కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాటిని అదుపుచేస్తూ "నేను
విష్ణుని" అన్నాడు.
ఆ పేరు విన్నంతనే జానకమ్మ భృకుటి
ముడిపడింది. అప్రియమైన దాన్ని చూసినట్లు ముఖం చిట్లించి "నువ్వా? ఎందుకొచ్చావు?"అంది. ఆమె స్వరంలో కఠినత్వం చోటు చేసుకుంది.
విష్ణు ఒక్క క్షణం మౌనం వహించాడు.
జానకమ్మ ఆ యువకుడివంక అసహ్యంగా చూస్తూ " చెప్పు. ఎందుకొచ్చావు?" అని రెట్టించింది.
"ఇల్లు వేలం చేస్తున్న విషయం
తెలిసింది. అందుకొచ్చాను" చెప్పాడు విష్ణు. "ఈ మా స్థితికి కారణం మీ
అమ్మ ,నువ్వు. మేం వీధినపడితే స్వయంగా చూడటానికి వచ్చావా? మీరు బాగుపడరు" శపించింది జానకమ్మ. విష్ణు బాధగా కళ్ళు
మూసుకున్నాడు.
" అమ్మా నేనిక్కడి
కొచ్చింది.మీకు సహాయ పడాలని" అన్నాడు."ఎవర్రా నీకు అమ్మ? కొంపలు ముంచడమేగాని, నింపడం మీకు తెలుసా? అయినా మీ సాయం
ఎవరిక్కావాలి? ముందిక్కడ నుంచి బయటకు నడువు"
అంది జానకమ్మ.
అదేసమయానికి లోపలినుంచి ఒక యువతి బయటకు వచ్చిం
ది. వయసు పద్దెనిమిది మించదు.సన్నగా అందంగా వుంది. తల్లి ఎవరో యువకుడిని
శాపనార్థాలు పెట్టడం గమనించి "ఏమయిందమ్మా?" అని అడిగింది.
"వీడెవడో తెలుసా? విశాలాక్షి కొడుకు. వీడి తల్లి మన కుటుంబాన్ని సర్వనాశనం
చేసింది. ఇప్పుడు వీడేదో కొత్త పథకం వేసుకొచ్చి మనకు సహాయం చేస్తానంటున్నాడు.
వెధవను బయటకు నడవమని చెప్పు" అని విసురుగా లోపలకు వెళ్లిపోయింది జానకమ్మ.
ప్రియంవద ఎదురుగా ఉన్న యువకుడివంక
చూసింది. వయసు పాతికలోపేఉంటుంది. ముఖంలో లాలిత్యం, సంస్కారం కనిపిస్తున్నాయి.అతడ్ని చూడగానే ఎవరికైనా మంచి భావం కలిగి తీరుతుంది.
అతనా అమ్మాయిని చూస్తూ "నీవు ప్రియంవదవు కదూ!" అన్నాడు. ఆ అమ్మాయి
అవునన్నట్లు తల పంకించి " ఎందుకు వచ్చావు? మీరంటే అమ్మకు చాలా కోపం" అన్నది.
అతనా మాట అంతగా పట్టించుకోకుండా ఆ
అమ్మాయి వంక అపురూపంగా చూసాడు. అతని
కన్నుల్లో కదలాడిన ప్రేమ భావం ఆమె హృదయం అర్థం చేసుకుంది.ఎంత కాదనుకున్నా అతను
తనకు అన్నయ్య. తన తండ్రి తాలూకు తీపి జ్ఞాపకం.అతనితో ఏం మాట్లాడాలో ప్రియంవద కు
అర్థం కాలేదు.
అంతలో లోపలనుంచి జానకమ్మ "
ప్రియా వాడువెళ్ళాడా ? " అని అరిచింది. ఆ
మాట
కు విష్ణు దెబ్బతిన్నట్లు చూసాడు.
"చెల్లీ నేను మీకు అవకారం చేయడా
నికి రాలేదు. మీ నుంచి ఏం ఆశించిరాలేదు. ఈ ఇల్లు నాన్నగారు ఎంత కష్టపడి కట్టించారో
నాకు బాగా తెలుసు. ఇది నాన్నగారి జ్ఞాపక చిహ్నం. దాన్ని మనం పోగొట్టు
కోకూడుకున్నదే నా తాపత్రయం"
అన్నాడు విష్ణు .
"డబ్బు లేకుండా మనం ఏం చేయగలం?" అంది ప్రియంవద."నేను డబ్బు తెచ్చాను. మీరు అంగీకరిస్తే
బాకీ తీర్చి వేలం పాట ఆపుచేయిస్తాను"అన్నాడు.
"కానీ మీ సహాయం అమ్మ
ఒప్పుకోదు" అంది ప్రియంవద ."నువ్వు ఒప్పించు. నా కోసం కాదు .నాన్నగారి
ఆత్మశాంతికోసం" . విష్ణు కన్నుల్లో తడి చేరింది. అది ప్రియంవద దృష్టిని దాటిపోలేదు.
"ప్రయత్నిస్తాను
కూర్చో!"అని ప్రియంవద విష్ణు కూర్చోడానికి కుర్చీ చూపించింది. అతను
కూర్చోలేదు. "ఫర్వాలేదు. నీవు అమ్మను
ఒప్పించే ప్రయత్నంచేయి"
అన్నాడు.
విష్ణుకు ఆ ఇంటిని చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందం కలగ
సాగింది. "ఈ ఇల్లు మా నాన్న గారిది" అన్న భావన ఎనలేని తృప్తిని
కలిగించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇల్లు చేజారి పోనీయ
కూడదు అనుకున్నాడు. అంతలో అతని దృష్టి గోడకు తగిలించి వున్న ఫోటో మీద పడింది. ఆ
ఫోటోలో ఆనందరావు నవ్వుతూఎంతో సంతోషంగా వున్నాడు.
తండ్రి ఫొటోని చూడగానేరెండుచేతులు
జోడించి నమస్కరించాడు.విష్ణు ఆలోచనలు
తండ్రి దిశగా పయనించాయి.
అందరూ తనను ఆనందరావు
ఉంచుకున్నదానికి పుట్టినవాడు అంటారు. కానీ ఆనందరావు గారెప్పుడూ తనను అలా చూడలేదు.
ఏ తండ్రీ కొడుక్కి పంచివ్వని ప్రేమను పంచాడు. తనమీద ఎనలేని అభిమానం చూపేవాడు.
విష్ణుకి తన తల్లి విశాలాక్షి
గుర్తుకొచ్చింది.
విశాలాక్షికి భర్త చనిపోయాడు.
పుట్టింటివాళ్లుగాని, మెట్టినింటివాళ్లు
గానీ ఇరువురూ ఆమెను అక్కున చేర్చుకోలేదు. ఏకాకిగా మిగిలిన విశాలాక్షి
చనిపోవాలనుకుంది.
అప్పుడు పరిచయమయ్యాడు ఆనందరావు.
అతను వ్యాపారం పనిమీద తరచు విశాలాక్షి
వుండే ఊరు వస్తుండే వాడు.ఆమె అతనికి దూరపు చుట్టం.తొలుత ఆమె పరిస్థితికి జాలిపడి
అతను సహాయం చేసాడు. క్రమేపీ పరిచయం పెరిగింది.ఆమె విలక్షణ వ్యక్తిత్వం అతని మనసు
చూరగొంది.
అతను అప్పటికే వివాహితుడు.ఆమె, అతని
సహాయం అందుకోవడం చూసిన లోకం
అతనామెను ఉంచుకున్నాడు అని అపవాదు వేసింది. ఎవరు ఏం అనుకున్నా అతను ఖాతరు చేయలేదు.
విశాలాక్షి సంగతి ఆ నోట ఈ నోటపడి
జానకమ్మ చెవిన పడింది. ఆమె ఆనంద రావుకి మధ్య కలతలు వచ్చాయి. అప్పటి నుంచి అతను విశాలాక్షి తోనే ఎక్కువ సమయం
వ సాగాడు. అతనికి వ్యాపారం
మీద ఆసక్తి సన్నగిల్లింది.
అతని ఆస్తి నెమ్మదిగా హరించుకు
పోసాగింది. దానికంతటికీ కారణం విశాలాక్షేనని జానకి నమ్మింది. పెద్దలను
పిలిపించింది. ఆనందరావు పరువు రచ్చకీడ్చింది. అందరూఆనందరావుని మందలించారు.
ఆనందరావు అందరితో ఒక మాట స్పష్టంగా
చెప్పాడు. "నేను విశాలాక్షికి అన్యాయం చేయను"అని."ఆమెకు న్యాయం
చేయడానికి నీ భార్యకి అన్యాయం చేస్తావా? "అని నిలదీసారు పెద్దలు. ఆమాటకు ఆనందరావు తలదించాడు. అప్పటినుంచి విశాలాక్షి
దగ్గరకు తరచుగా
వెళ్లడం తగ్గించాడు. అప్పటికే వాళ్ల
అనురాగానికి చిహ్నంగా విశాలాక్షికి విష్ణు
పుట్టాడు.
ఆనందరావు వారానికోసారి విశాలాక్షి
దగ్గరకొచ్చి వాళ్ల మంచి చెడ్డలు చూసేవాడు. విశాలాక్షికి, విష్ణుకి అతనేం లోటు చేయలేదు. లోకం ఉంచుకున్నదన్నా, ఆనందరావు మాత్రం విశాలాక్లిని స్వంత భార్యకంటే ఎక్కువగా
చూసుకునేవాడు. ఇక విష్ణు అంటే అతనికి పంచ ప్రాణాలు.
ఆ తరువాత జానకికి ప్రియంవద
పుట్టింది.
ఆనందరావు ఇద్దరు భార్యలను, విష్ణు, ప్రియంవదలను
అపురూపంగా చూసుకునేవాడు. అతని ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. అందుకు కారణం
అతని సొమ్మంతా విశాలాక్షి దోచుకోవడమే నని భావించేది జానకి. ఆమెకు, విశాలాక్షి మీద అక్కసుగా వుండేది.
ఆ మనిషిని ప్రత్యక్షంగా
చూడకపోయినామనసులో శాపనార్ధాలు పెట్టేది. విష్ణు డిగ్రీ చదువుకు వచ్చాడు . ఆనందరావు
హఠాత్ గా గుండెపోటుతో కన్ను మూశాడు.
ఆ విషయం జానకి, విశాలాక్షికి కబురు చేయలేదు.ఆనందరావు అంత్యక్రియలు ముగిశాక ఆనందరావు మరణవార్త తెలిసింది విశాలాక్షికి.
ఆమె, విష్ణుని తీసుకొని ఆనందరావు ఊరు వెళ్ళి అతనింటికి వెళ్ళింది. జానకమ్మ వాళ్ళను
మెడ పట్టి గెంటినంత గొడవ చేసింది. విశాలాక్షి దుఃఖం రెట్టింపయింది.
ఆనందరావు తోడు లేని దుస్థితికి
విలపించింది.పుట్టెడు దుఃఖంతో ఇల్లు చేరింది. ఆ తరువాత మెల్లగా కొడుకు కోసం ధైర్యం
తెచ్చుకుంది.ఆనందరావు నేర్పిన జీవిత పాఠాలతో జీవితం ఎదుర్కొంది.ఆనందరావు చనిపోయి
రెండేళ్లు గడిచాయి. కొడుకుచేత డిగ్రీ పూర్తి చేయించింది.
డిగ్రీ చేసిన విష్ణుకి మంచి ఉద్యోగం
వచ్చింది.
ఆర్థిక ఇబ్బందులు
తప్పాయి.వారికి తరచూ ఆనందరావు జ్ఞాపకానికి
వచ్చేవాడు. అతడు తమమీద చూపిన ప్రేమ, జ్ఞాపకానికి వచ్చేది. కనీసం అతని ఫోటో కూడా తమ దగ్గర లేనందుకు కుమిలిపోయే
వారు.
ఈమధ్య కాలంలో ఒకరోజు ఆనందరావు
బంధువు ఒకతను విష్ణుకి కనిపించినప్పుడు"ఆనందరావు ఇల్లు వేలానికి
వచ్చింది" అన్న వార్త చెవినవేసాడు.
అది తెలిసి విశాలాక్షి దుఃఖించింది.
కొడుకుతో "విష్ణు! ఆ ఇల్లు మీ నాన్నగారి జ్ఞాపక చిహ్నం. ఆ ఇల్లంటే ఆయనకు
ప్రాణం. అది వేలం వేస్తే అతని ఆత్మ క్షోభిస్తుంది. అంతేకాదు మీ పెద్దమ్మ, చెల్లెలు దిక్కులేని వారవుతారు. వివరాలు కనుక్కొని, ఆ డబ్బు సర్దుబాటుచేసి ఆ ఇల్లు వాళ్లకు దక్కించు" అని కోరింది.
విష్ణు వేలం విషయం వాకబు చేసాడు. ఆ
ఇల్లు రెండు లక్షలకు తాకట్టు పెట్టబడింది. వడ్డీతో రెండున్నర లక్షలు అయింది. ఆ
బాకీ తీర్చగలిగితే వేలంపాట
ఆగిపోతుంది. అతనా డబ్బుతో తండ్రి
ఇంటికి బయలుదేరాడు.
అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ
ప్రియంవద బయటకు వచ్చింది. "అమ్మతో మాట్లాడాను. బాకీ తీర్చి ఈ ఇల్లు మిమ్మల్ని
స్వాధీనం చేసుకోమంది. మేం ఈ ఊరు
విడిచి వెళ్లిపోతాం" అంది.
ఆ మాటకు విష్ణు విలవిల్లాడాడు.
"చెల్లీ! నేను వచ్చింది ఆ ఉద్దేశ్యంతో కాదు. ఈ ఇల్లు ఎప్పటికీ మీదే!
మీరెక్కడికీ వెళ్లవలసిన పనిలేదు. ఎంత కాదనుకున్నా ఆనందరావు గారు నాకూ తండ్రి.అతని
జ్ఞాపక చిహ్నమైన ఈ ఇల్లు పరాయివాళ్లకు దక్కనీయడం ఇష్టంలేక వచ్చాను. ఈమాట అమ్మతో చెప్పు .అమ్మ సమ్మతిస్తే బాకీ
తీర్చివెళ్తాను" అన్నాడు విష్ణు.
జానకమ్మ, విష్ణుని సందేహించింది. 'ఏ స్వార్ధం లేకుండా ఎందుకు అప్పు తీరుస్తాడు? ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చాడు" అంది ప్రియంవద తో.
"అతను అలాంటి వాడిలా అనిపించడం
లేదమ్మా! ముందు అతన్ని బాకీ తీర్చనిద్దాం. మెల్లగా మనమా డబ్బు అతనికిచ్చి ఋణం తీర్చుకుందాం. ఈ
పరిస్థితిలో మనం ఇల్లు విడిచి ఎక్కడ బ్రతకగలం?" అంది ప్రియంవద.
"నీ ఇష్టం"అంది జానకమ్మ. విష్ణు, వివరాలు తీసుకువెళ్లి ఇంటిమీది బాకీ
తీర్చేసాడు. ఆ పత్రాలు తెచ్చి ప్రియంవదకు అందజేసాడు. ఇక ఇల్లు వేలం వేయబడదు. మీరు
నిశ్చింతగా వుండండి. నేను బయలుదేరతాను" అన్నాడు.
తమకంత సహాయం చేసిన విష్ణుని కనీసం
కూర్చోబెట్టనందుకు ప్రియంవద బాధ పడింది. జానకమ్మ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. భోజన
సమయమైనా విష్ణుని భోజనానికి ఆహ్వానించలేదు.
విష్ణు ,ప్రేమతో ప్రియంవద తల నిమిరి "వస్తాను చెల్లీ!
"అన్నాడు. ప్రియంవదకు అతని మీద ప్రేమ పెల్లుబికింది. "అన్నయ్యా
!"అని అతని
భుజంమీద తలవాల్చి సేద తీరాలనిపించింది. తెలియని
సంకోచంతో అలా చేయలేక పోయింది.
బయలుదేరిపోయిన విష్ణు ఒక్కక్షణం ఆగి
ప్రియంవదతో" ఒక చిన్న కోరిక తీర్చగలవా? చెల్లీ!" అన్నాడు."ఏమిటది?"కుతూహలంగా అడిగింది ప్రియంవద.
" మా దగ్గర నాన్న గారి ఫోటో
ఒక్కటి కూడా లేదు.ఒక్క ఫోటో ఇస్తే పూజకు ఉపయోగించు కుంటాం " ప్రాధేయ పడ్డాడు
విష్ణు." అలానే" అని లోనికి నడిచింది ప్రియంవద.
"మన ఆస్తంతా దోచుకున్నవారికి మీ
నాన్న
ఫోటోతో ఏం పని? ఇవ్వమని చెప్పు" జానకమ్మ
స్వరం కఠినంగా
వినిపించింది.ప్రియంవద
బయటకు వచ్చి " అమ్మ ఒప్పుకోవడం
లేదు"
అని బాధగా చెప్పింది.
విష్ణు ఒక్క క్షణం మౌనం వహించాడు. ఆ
తరువాత " అమ్మా!పియా! వెళ్ళే ముందు
ఒక నిజం చెప్పాను. మీరునమ్మినా, నమ్మక పోయినా నా ఆత్మ సంతృప్తికోసం చెప్తాను. నాన్నగారికి పేకాట వ్యసనం వుంది.ఆ విషయం ఎవరికీ
తెలీదు.అసలతను ఆ పనిమీదే మా ఊరు వచ్చేవారు. పేకాటలోనే
డబ్బు పోగొట్టుకున్నారు. అమ్మ ఎంత వేడుకున్నా అతను పేకాట మానలేదు. మేం
నాన్నగారి ప్రేమ అనుభవించామేగాని, అతనిసొమ్ము
దోచుకోలేదు. ఆ నిజం అమ్మ
నమ్మకపోయినా, కనీసం నువ్వు నమ్ము. వస్తాను."
విష్ణు బయలుదేరిపోయాడు.
విష్ణు వచ్చి వెళ్లిన నెలరోజుల
తర్వాత ప్రియంవద స్నేహితురాలు ఒకమ్మాయి ప్రియంవదను కలిసి ప్రియా! నీకో సంగతి
చెప్పాలని వచ్చాను. మా అన్నయ్య పనిచేసే ఆఫీసులోనే మీ అన్నయ్య విష్ణు
కూడా పనిచేస్తున్నాడట. అతను మీ ఇంటి
బాకీ ఎలా తీర్చాడో మా అన్నయ్య చెప్పాడు. అది చెప్పడానికే వచ్చాను" అంది.
"ఎలా తీర్చాడు?"కుతూహలంగా అడిగింది ప్రియంవద."వాళ్లమ్మ గారికి
కేన్సరట. వైద్యం కోసం విష్ణు అప్పు చేశాడట.అంతలో మీ ఇల్లు వేలానికి వచ్చిన సంగతి
తెలిసి,
తల్లి వైద్యానికి దాచిన డబ్బుతో మీ ఇంటి బాకీ
తీర్చాడట"చెప్పి వెళ్లిపోయింది స్నేహితురాలు.
ప్రియంవద కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
ఆమె కళ్లముందు విష్ణు దీనవదనం కదలాడింది. అతని చూపుల్లో తన మీద వర్షించిన అనురాగం,"చెల్లీ!" అని పిలిచినపుడు ఆ పిలుపులో కదలాడిన
వాత్సల్యం ఆమె హృదయాన్ని కుదిపేసాయి.
"చెల్లీ !చిన్న కోరిక" అని తండ్రి ఫోటో ఆడి
గితే ఇవ్వని తమ జాలి లేనితనానికి
ప్రియంవద చింతించింది.
వెళ్లి తల్లితో తను విన్నది
చెప్పింది. అప్పటికే జానకమ్మ హృదయంలో విష్ణుపట్ల తను క్రూరంగా
ప్రవర్తించానేమోనన్నశంక ఉంది. వాకబుచేసి ఆమె భర్తకున్న పేకాట వ్యసనం గురించి
నిర్ధారించుకుంది.
ఇప్పుడు విన్నదాన్నిబట్టి ఆ చిన్న
కుర్రాడు అంత పెద్ద త్యాగం చేసి, తను అన్ని మాటలు
విసిరినా తల్లి జబ్బు గురించిగానీ, అందుకు తాను అప్పు చేసిన డబ్బుతో అప్పు తీరుస్తున్నట్లు గాని చెప్పకపోవడం
జానకమ్మ హృదయాన్ని కదిలించింది. రెండురోజులు హృదయంలో సంఘర్షణ అనుభవించిన జానకమ్మ
మరిక వుండబట్టలేక ప్రియంవదతో బయలుదేరి విష్ణు వాళ్ల ఊరు చేరింది. వాకబుచేసి
విశాలాక్షి వుండే ఇల్లు తెలుసుకుంది.
జానకమ్మను చూసి విశాలాక్షి
ఆశ్చర్యపోయింది. అది గమనించిన జానకమ్మ "నీ ఆరోగ్యం బాగుండలేదని తెలిసింది.
చూసిపోదామని వచ్చాం" అంది.
విశాలాక్షి వాళ్లకు మర్యాదలు
చేసింది. విష్ణు ఆఫీసు నుంచి వచ్చేసరికి వాళ్ల భోజనాలయ్యాయి. జానకమ్మను, ప్రియంవదను చూసి విష్ణు విస్మయం చెంచాడు. తరువాత ప్రేమగా
పలకరించాడు.
ఆ రాత్రి జానకమ్మ ,విశాలాక్షితో "ఇక్కడి ఇల్లు ఖాళీ చేసేయండి. ఇక మీదట
అందరం మా ఊళ్లో మనింట్లో కలిసి వుందాం. అనుకోకుండా ఆయన తాలూకు ఇన్స్యూరెన్స్ డబ్బు
వచ్చింది. ఆ డబ్బుతో నీకు వైద్యం చేయిస్తాను" అంది. అందుకు విశాలాక్షి "
అక్కా! అంత మాట అన్నావు.అదే పది వేలు.
మేం ఎక్కడికి రాము. మీ ప్రేమ చాలు" అంది.అయితే జానకమ్మ
ఒప్పుకోలేదు.గట్టి పట్టు పట్టింది.
వారం తరువాత ఇల్లు ఖాళీ చేసి అందరూ
ఆనందరావు స్వంత ఊరు చేరారు.
చె క్కగేటు తీసుకుని తల్లితో కలిసి
ఆ ఇంట్లోకి అడుగులు వేస్తుంటే, తండ్రి తన
విశాలమైన బాహువులు చాపి తమను
ఆహ్వానిస్తున్న అనుభూతి కలిగింది విష్ణుకి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
Hi Please, Do not Spam in Comments