మాట్లాడటం ఒక కళ. అందరూ
మాట్లాడతారు. ఏది అనుకుంటే అది మాట్లాడేస్తారు. కాని చక్కగా మాట్లాడటం మనకు
వచ్చునా?
అందరూ వక్తలు కాకపోయినా, చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి. చక్కగా సంభాషించాలి.
మాట్లాడకపోతే నష్టమా? ఎంతో నష్టం. నోరు
మంచిదైతే వూరు మంచిది అన్నారు.
మాట్లాడటంలో ఏముంది అని అనుకోవడం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ.
తానొవ్వక ఇతరుల నొప్పించక మాట్లాడాలి. చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్ళీ
మళ్ళీ వినాలని అనిపించాలి. మంచినే మాట్లాడాలి. చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా
జాగ్రత్తపడాలి. నిజాయతీగా మాట్లాడాలి. నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం
మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకు రావడానికి అప్రమత్తంగా
మాట్లాడాలి.
ముందే దుర్యోధనుడు వచ్చినా, అర్జునుణ్ని ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి. కురుక్షేత్ర రణరంగం
మధ్యలో రథాన్ని నిలిపి, అర్జునుడి విషాదం
గ్రహించి,
అతణ్ని యుద్ధం వైపు తిప్పిన ఆ భగవానుడి సంభాషణలు
విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనక ప్రస్తుత కాలానికి
అవసరమైన వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల
గురించి ఎన్నో విషయాలున్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి
కానరాడు.
బుద్ధుడు కొన్నివేల మైళ్లు తిరిగి, ఒక సంఘం స్థాపించి ఎంతో మందిని తనవైపు ఆకర్షించడానికి ఎన్నో
సంభాషణలు చేశాడు. అతడి మాటలు వినడానికి జనం బారులు తీరారు. పరుగులు తీశారు.
ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నోచోట్ల బుద్ధుడి దివ్యమైన శక్తిమంతమైన మాటలు వినిపిస్తూనే
ఉంటాయి.
చిన్న చిన్న ఉదాహరణలతో చక్కటి మహిమగల మాటలాడి తన దివ్యత్వం చూపించిన జీసస్‌ను
ఎన్నో మిలియన్ల మంది ఆరాధిస్తున్నారు. ఆయన వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా. తన
అనుభూతిని అందరికీ తెలిసిన ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు తెలియజేసిన
రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవచంద్ర సేన్ లాంటి పండితులు తలవంచారు.
ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో
అద్భుత ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా
అంతా మార్మోగాయి. దేశదేశాలు వివేకానందుడి వాక్కులకోసం పరితపించి పోయాయి. జ్ఞాన
సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతకు కూడా జీవన లక్ష్యంవైపు దిశానిర్దేశం
చేస్తూనే ఉన్నాయి. అంకితభావం కలిగి, శుద్ధత్వం సంపాదించుకుని లోక కల్యాణం కోసం జీవించిన గురునానక్, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు మరచిపోగలమా?
అందరం మాట్లాడతాం. మంచిగా మాట్లాడదాం. మంచి కోసం
మాట్లాడదాం. దీన, హీన జనుల పక్షాన
నిలబడి మాట్లాడదాం. లోకం నీతిమార్గంలో నడవడానికి, మహనీయుల బోధలు అనుసరించడానికి జనులను జాగృతం చేయడానికి మాట్లాడదాం. నీకోసం
నాకోసం మాటలు తగ్గించి పదిమంది మేలు కోసం పరులహితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం.
అదే నిజమైన దైవస్తుతి.
జీవితంలో క్రమశిక్షణ, సమయ పాలన వుంటే మనిషి ఏదయినా సాధించగలడు. పనిలో నుంచే
సంతోషాన్ని వెతుక్కోవాలి, ప్రతి ఒక్కరు
ఆనందాన్ని స్వతహాగా సృష్టించుకోవాలి.
ఆలోచించకుండా మాట్లాడడం, గురి చూడకుండా బాణం వేయడం వంటిది. “తాను ఏమి మాట్లాడాలో
తెలిసినవాడు, తెలివయినవాడు, తాను ఏమి మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు, వివేకవంతుడు.” అన్నారు స్వామి వివేకానంద. ఎవరయితే మాటలవల్ల, చేతలవల్ల ఇతరులకు భాద కలిగిచకుండా వుంటారో వారే ఉత్తములు.
ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ.
అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలు చాలా పదునయినవి కనుక జాగత్తగా
వాడాలి,
బలమయినవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదయినవి కనుక పొదుపుగా వాడాలి. అందరిలాగా కేవలం నోటితో
మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి
పెడుతుంది. శత్రువుల్ని తయారుచేస్తుంది. మనిషికి భావవ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏమి
మాటలాడవనేదానికన్నా, ఏలా
మాటలాడవనేదాన్ని బట్టి భావప్రసారణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత
గొప్పగా వుంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంది.
పుస్తకం వాట్సప్ సమూహం నుండి సేకరణ
Hi Please, Do not Spam in Comments